25 అడుగుల సొరంగం.. 30 లాక‌ర్ల లూటీ

Bank Of Baroda

ఇంట్లో అయితే దొంగ‌లు ప‌డి దోచుకుంటార‌నే భ‌యంతో కొంత మొత్త ఖ‌ర్చ‌యినా భ‌రించి విలువైన వ‌స్తువులు, న‌గ‌దును బ్యాంకుల్లో లాక‌ర్లు తీసుకుని మ‌రీ దాచుకోవ‌డం అనే సంస్కృతి ఇటీవ‌ల కాలంలో పెరుగుతోంది. అయితే, అలా దాచుకున్న లాక‌ర్ల‌ను కూడా దొంగ‌లు వ‌ద‌ల‌డం లేదు. ఎంతో క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త ఉన్న‌ప్ప‌టికీ వాటినీ దోచేస్తున్నారు. తాజాగా దేశ వాణిజ్య రాజ‌ధాని ముంబైలో జ‌రిగిన గ‌జ‌దొంగ‌త‌నం అంద‌రినీ నిశ్చేష్టుల‌ను చేసింది. ప‌క్కా ప్లాన్‌తో కొన్ని నెల‌ల ముందు నుంచే అడుగులు వేసిన దొంగ‌లు ఏకంగా అతి పెద్ద బ్యాంకుకే క‌న్నం వేసి భారీగా దోచేశారు. దాదాపు 25 అడుగుల సొరంగం చేసుకుని నేరుగా స‌ద‌రు బ్యాంకు లాక‌ర్లు ఉండే స్ట్రాంగ్ రూంలోకే వెళ్లిపోయారు. ఫ‌క్తు సినిమా దొంగ త‌నాన్ని త‌ల‌పించిన ఈ ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది. 

విష‌యంలోకి వెళ్తే.. న‌వీ ముంబై స‌మీపంలో జునీన‌గ‌ర్ ప్రాంతంలో బ్యాంక్ అఫ్ బ‌రోడా బ్రాంచ్ ఉంది. ఇక్క‌డి వ్యాపార వేత్త‌లు, ప్రారిశ్రామిక వేత్త‌లు ఈ బ్యాంకు లాక‌ర్ల‌లో త‌మ విలువైన ఆభ‌ర‌ణాలు, న‌గ‌దును దాచుకున్నారు. అయితే, కొంద‌రు దొంగ‌లు ఈ బ్యాంకు లాక‌ర్ల‌పై క‌న్నేశారు. ఎలాగైనా స‌రే దోచుకోవాల‌ని ప్లాన్ చేశారు. ఈ ఏడాది మే నెల‌లో బ్యాంకుకు స‌మీపంలోని ఓ దుకాణాన్ని అద్దెకు తీసుకున్నారు. వ్యాపారం చేస్తామ‌ని దుకాణ య‌జ‌మానిని న‌మ్మించారు. అనంత‌రం, ఈ దుకాణం నుంచి బ్యాంకు లాక‌ర్లు ఉండే స్ట్రాంగ్ రూం వ‌ర‌కు దాదాపు 25 అడుగుల పొడ‌వున అతి ర‌హ‌స్యంగా ఓ సొరంగాన్ని త‌వ్వేశారు. చాక‌చ‌క్యంగా ఈ సొరంగం గుండా బ్యాంకులోని లాక‌ర్ల వ‌ద్ద‌కు వెళ్లి.. అక్క‌డి 225 లాక‌ర్ల‌లో 30 లాక‌ర్ల‌ను ఓ పెన్ చేశారు. 

వాస్త‌వానికి శుక్ర‌వారం వ‌ర‌కు ఎలాంటి తేడా రాలేద‌ని బ్యాంకు అధికారులు తెలిపారు. శ‌నివారం, ఆదివారం సెల‌వులు రావ‌డంతో అన్నీ స‌రిచూసుకుని తాళాలు వేసి ఇళ్ల‌కు వెళ్లామ‌ని చెప్పారు. సోమ‌వారం తిరిగి బ్యాంకుకు వ‌చ్చాక లాక‌ర్లు ఉన్న స్ట్రాంగ్ రూంలోకి వెళ్ల‌గా.. దాదాపు 30 లాక‌ర్లు తెరిచి ఉండ‌డం గ‌మ‌నించి, పోలీసుల‌కు స‌మాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ప‌రిశీలించ‌గా.. మ‌నిషి ప‌ట్టే స్థాయిలో ఓ సొరంగం బ‌య‌ప‌డింది. అది స‌మీపంలోని ఓ దుకాణంలోకి దారితీసింది. దీంతో ఇది ప‌క్కాగా క‌ర‌డు గ‌ట్టిన దొంగ‌ల ముఠా ప‌నేన‌ని వారు నిర్ధారించారు. 

సీసీటీవీ ఫుటేజ్‌ల‌ను ప‌రిశీలించారు. మొత్తంగా 30 లాక‌ర్లు తెరిచి దాదాపు 40 ల‌క్ష‌ల రూపాయ‌ల విలువైన వ‌స్తువుల‌ను దోచుకున్నార‌ని నిర్ధారించారు. ప్ర‌స్తుతం దీనిని తాము స‌వాలుగా తీసుకున్నామ‌ని న‌వీ ముంబై పోలీస్ క‌మిష‌న‌ర్ మీడియాకు చెప్పారు. ఆ దోపిడీ శ‌ని, ఆదివారాల మ‌ధ్య జ‌రిగి ఉంటుంద‌ని భావిస్తున్నామ‌న్నారు. ఏదేమైనా ముంబైలో జ‌రిగిన ఈ భారీ దోపిడీ.. తీవ్ర సంచ‌ల‌నం సృష్టించింది. బ్యాంకుల తాళాలు భ‌ద్రంగానే ఉన్నా... దొంగ‌లు ఇలా రెచ్చిపోవ‌డం అంద‌రినీ షాక్‌కు గురి చేసింది. ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు పోలీసులు ఎవ‌రినీ అదుపులోకి తీసుకోలేదు.