జీవిత.. మళ్లీ పార్టీ మారుతున్నారా, ఏం సాధించడానికి?

ఇప్పటికి వాళ్లు తిరగేయని పార్టీ అంటూ ఏదీ లేకుండా పోయింది.. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ.. ఇదీ వరస. ఇప్పటి వరకూ వీళ్లు ఈ పార్టీలన్నీ తిరగవేశారు. అప్పట్లో ఎన్టీఆర్ కు సన్నిహితంగా మెలిగిమని ప్రకటించుకున్నారు, ఆ తర్వాత ప్రజారాజ్యం మీద దుమ్మెత్తిపోసి కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. రాజశేఖర రెడ్డి మనుషులుగా చలామణి అయ్యారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున యాక్టివ్ పాలిటిక్స్ లోకి ఎంటరయ్యారు. ఆ వెంటనే వైఎస్ మరణంతో వీళ్లు ఖాళీ అయిపోయారు.

తర్వాత జగన్ కొత్త పార్టీ పెట్టాకా.. ఆయన వెంట నిలిచారు.. జగన్ పార్టీలో కొంత కాలం పని చేయగానే మళ్లీ ఆయనపై ఏవో విమర్శలు చేశారు. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశాం అని ప్రకటించారు. ఆ తర్వాత మరికొంత కాలం ఖాళీగా మిగిలిపోయారు. ఆ ఖాళీ సమయంలో వివిధ సినిమాలు తీసి చేతులు కాల్చుకున్నారు. అవేవీ సరిగా ఆడలేదు. ఆపై భారతీయ జనతా పార్టీ ఊపులోకి వచ్చేసరికి అటువైపు జంప్ చేశారు. భారతీయ జనతా పార్టీలోకి చేరుతున్నట్టుగా ప్రకటించుకున్నారు. ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

ఇప్పుడు ఆ పార్టీలో కూడా ఉండేలా లేరు వీళ్లు.. తెలుగుదేశం పార్టీ వైపు గాలి మళ్లిందట. ఈ విషయాన్ని జీవిత స్వయంగా ప్రకటించుకుంది. బాబుపై ప్రశంసల వర్షం కురిపించింది. ఈ మాటలు చూస్తుంటే త్వరలోనే తెలుగుదేశం తీర్థం అని స్పష్టం అవుతోంది. ఈ విధంగా టీడీపీతో మొదలుపెట్టి.. ఆ తర్వాత మూడు పార్టీలు మారి... మళ్లీ టీడీపీలోకి వస్తున్నట్టుగా తెలుస్తోంది.

భారతీయ జనతా పార్టీలో చేరినందుకు గానూ జీవితకు సెన్సార్ సభ్యురాలిగా అవకాశం లభించింది. అయితే ఆ పార్టీ తరఫున ఈమె గట్టిగా మాట్లాడిన దాఖలాలు ఏమీ లేవు. మాటకారి అయిన జీవిత ఇప్పుడు మళ్లీ టీడీపీలోకి రావడం వరకూ ఓకే కానీ.. ఆ పార్టీలో చేరి సాధించేది ఏమిటనేది మాత్రం ప్రశ్నార్థకమే!