నంది అవార్డుల కంపు... అన్నీ ఒక కులానికేనా?!

Nandhi Awards

మూడేళ్ల నందీ అవార్డులను ఒకేసారి ప్రకటించారు. ప్రభుత్వం అంత తీరిక లేకుండా ఉంది పాపం. జనాలు మరిచిపోయిన సినిమాలను ఇప్పుడు నందీ అవార్డులు అంటూ గుర్తు చేశారు. అయితే.. ఈ అవార్డులు కొత్త కంపును రేపుతున్నాయి. ఈ అవార్డుల్లో మెజారిటీ భాగం ఒకే ఒక కులానికి దక్కడం విడ్డూరంగా మారింది. అన్ని విభాగాల్లోనూ ఒక కులానికి చెందిన ఆర్టిస్టులకే అవార్డులు దక్కాయి. మిగతా వాళ్ల సినిమాలను పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు.

ప్రధానమైన ఉత్తమ నటుడి విభాగం అవార్డులు.. బాలయ్యకు, ఎన్టీఆర్ కు, మహేశ్ బాబుకు దక్కాయి. వీళ్లు ముగ్గురూ కమ్మ సామాజికవర్గానికి చెందిన నటులే. ఇక ఉత్తమ దర్శకులుగా నిలిచిన రాజమౌళి, బోయపాటి శీనులు అదే సామాజికవర్గానికి చెందిన వాళ్లే. ఇక ఉత్తమ చిత్రాలుగా ఎంపిక అయిన సినిమాలు లెజెండ్, బాహుబలి లు కమ్మ వాళ్లు తీసుకున్న సినిమాలే. మనం, ఎవడేసుబ్రమణ్యం, నేను శైలజ.. సినిమా వెనుక, శ్రీమంతుడు సినిమా వెనుక ఉన్నది ప్రధానంగా కమ్మ వాళ్లే. లౌక్యం కూడా అదే కేటగిరినే. 

ఓవరాల్ గా నందీ అవార్డుల జాబితా ను పై నుంచి కిందికి, కింది నుంచి పైకి.. ఇలా ఎలా చూసినా కమ్మ వాళ్ల పేర్లే ప్రధానంగా వినిపిస్తున్నాయి, కమ్మ వాళ్లు తీసిన సినిమాలే అవార్డులు పొందాయి. ఒక్క హీరోయిన్ల విభాగం మాత్రమే మిస్ అయ్యింది. కమ్మ వాళ్ల ఆధిపత్యాన్ని తట్టుకుని ఈ జాబితా లో నిలిచిన సినిమాల పెళ్లి చూపులు, శతమానంభవతి మాత్రమే. 

ప్రత్యేకించి ప్రధాన విభాగాల్లో మెగా హీరోల సినిమాలేవీ నిలవలేకపోయాయి. అలాగే భలేభలే మగాడివోయ్ వంటి సినిమా కూడా అవార్డుల కమిటీని రంజింపలేకపోయింది. ఇక లెజెండ్ వంటి సినిమాకు ప్రముఖ విభాగాల్లో అవార్డులు దక్కడం విమర్శకులకు పని చెప్పింది. తెలుగుదేశం అధినేతకు సన్నిహితులుగా పేరు పొందిన వాళ్లకే ఈ అవార్డులు ఇచ్చారనే మాట కూడా వినిపిస్తోంది. లెజెండ్ సినిమాకు మూడు ప్రధాన విభాగాల్లో అవార్డును ఇచ్చుకున్నారు. హీరోకి, దర్శకుడికి, ఉత్తమ సినిమా కేటగిరి.. ఇలా మూడు విభాగాల్లో ఇచ్చుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టే... ఇలా జరిగిందనే మాట వినిపిస్తోంది. 

ఏదేమైనా.. నందీ అవార్డుల ప్రకటన.. కులం కంపును దట్టించుకుంది. ఈ అవార్డుల ప్రకటన విషయంలో విమర్శల వాన కురుస్తోంది. ఈ రచ్చ ఇప్పుడప్పుడే తగ్గుముఖం పట్టేలా లేదు కూడా!