ఆనం వివేకా నెల్లూరుకు ఎందుకు రావడం లేదో తెలుసా?

నెల్లూరు జిల్లా నుంచి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డికి మంత్రి పదవి ఇచ్చిన తరువాత అక్కడ ఆనం కుటుంబం సోదిలోకి లేకుండా పోయింది. కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన ఆనం సోదరులు ఇప్పుడు తామెందుకు ఈ పార్టీలో చేరామా? అని తెగ బాధపడుతున్నారట. ఆనం సోదరుల్లో ఒకరైన మాజీ మంత్రి రామనారాయణ రెడ్డి దీనిపై కక్కలేక మింగలేక మౌనంగా ఉంటున్నా కూడా ఆయన సోదరుడు వివేకా మాత్రం ఇటీవల దీనిపై మాట్లాడారు. అవమానాలు భరించలేకపోతున్నామని... తాను ఇప్పట్లో నెల్లూరుకు వచ్చి ముఖం చూపించలేనని ఆయన అనడం సంచలనంగా మారింది.

గత మూడు నెలలుగా ఆనం వివేకా నెల్లూరు రాలేదు. ఆయనకు ఆరోగ్యం సహకరించకపోవడం ఇందుకు ఒక కారణమైతే... మరో కారణం రాజకీయంగా ఉనికి కోల్పుతుండడం. టీడీపీలో చేరాక పరిస్థితి బాగుంటుందని వారు ఆశపడినా అలాంటిదేమీ జరగలేదు. 

పైగా ఆనం వ్యతిరేకులకు పదవులిచ్చి వీరికి ఎలాంటి పదవులు ఇవ్వలేదు.  ఆనం వివేకా వ్యాఖ్యలు కూడా ఇందుకు అద్దం పడతున్నాయి. ఎవరెవరికో పదవులు ఇస్తున్నారని…. తనకు ఎమ్మెల్సీ ఇస్తానని గతంలో చంద్రబాబు చెప్పారని ఆయన గుర్తు చేశారు. 

ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ పదవి వచ్చే అవకాశం లేదని... గవర్నర్‌ కోటాలో రామసుబ్బారెడ్డి, ఫరూక్‌లకు ఎమ్మెల్సీ పదవులు ఇవ్వబోతున్నారని ఆయన తనను కలిసిన అనుచరులతో చెప్పారంటూ ఒక తెలుగు పత్రికలో కథనం వచ్చింది. అంతేకాదు.. తమ సొంత కాలేజీ అయిన పీఆర్‌సీ కళాశాల ఆవరణలో జరిగిన జూనియర్ కాలేజీ ప్రారంభోత్సవానికి కూడా తమను ఆహ్వానించలేదని..  ఇంతకంటే అవమానం ఏముంటుందని ఆనం ఆవేదన చెందినట్లు తెలుస్తోంది.